: రామోజీరావు, జగన్ ల కరచాలనం... మాటామంతీ!
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు, వైసీపీ అధినేత, సాక్షి వ్యవస్థాపక చైర్మన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య అరుదైన కలయిక చోటుచేసుకుంది. ఇందుకు టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్ కుమార్, ప్రణతిల వివాహ వేడుక వేదికైంది. కొద్దిసేపటి క్రితం మాదాపూర్ లోని హైటెక్స్ లో జరిగిన ఈ పెళ్లికి కాస్త ముందుగానే రామోజీరావు చేరుకున్నారు. ఆ తర్వాత వైసీపీ గౌరవాధ్యక్షురాలు, తన తల్లి వైఎస్ విజయమ్మ, పార్టీ నేతలతో కలిసి జగన్ అక్కడికి చేరుకున్నారు. వచ్చీరాగానే జగన్ నేరుగా రామోజీరావు కూర్చున్న చోటుకి వెళ్లి ఆయనకు చేతులెత్తి నమస్కారం చేశారు. దీనికి వేగంగా ప్రతిస్పందించిన రామోజీరావు కూర్చున్న సీటులో నుంచి లేచి జగన్ కు చేయందించారు. జగన్ కూడా రామోజీరావుతో కరచాలనం చేశారు. అనంతరం రామోజీ కూర్చున్న సీటుకు ఆనుకుని ఉన్న సీట్లో జగన్ కూర్చున్నారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ దృశ్యం అక్కడి వారికి కనువిందు చేసింది. అంతకుముందు అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాక ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే, జగన్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు.