: ఎగ్జిట్ రూటులో ఎంట్రీ కుదరదన్న మహిళా పోలీసు... రూటు మార్చిన కేంద్ర మంత్రి
విధి నిర్వహణలో ఉండగా సాధారణ పౌరుడైనా, కేంద్ర మంత్రి అయినా ఒకటేనని మరో మహిళా పోలీసు నిరూపించారు. రాంగ్ రూటులో వెళుతున్న కేంద్ర మంత్రిని నిలిపేసిన ఆ పోలీసు, రూటు మార్చాల్సిందేనని తేల్చిచెప్పారు. అయితే తప్పును గ్రహించిన కేంద్ర మంత్రి కూడా మహిళా పోలీసు సూచన ప్రకారం తన రూటు మార్చుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసు అధికారి నిక్కచ్చితనాన్ని మెచ్చుకోవడమే కాక, ఆ అధికారి సూచనతో తాను రూటు మార్చుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి మీడియా ముందు చెప్పుకుని మరీ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఘటన నిన్న బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి ఎగ్జిట్ మార్గంలో వెళుతున్న కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ను అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ మహిళా పోలీసు అడ్డుకున్నారు. ఎగ్జిట్ రూటులో ఎంట్రీ కుదరదని తేల్చిచెప్పారు. దీంతో మంత్రి కారు నిలిచిపోగా, రామ్ కృపాల్ యాదవ్ పోలీసుతో మాట్లాడారు. అనంతరం తన వాకీటాకీ ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదించిన మహిళా పోలీసు ఆ రూటులో ఎంట్రీ కుదరదని మంత్రికి తేల్చిచెప్పారు. దీంతో మంత్రి తన కారును వెనక్కు తిప్పుకుని ఎంట్రీ మార్గం ద్వారానే విమానాశ్రయం లోపలికి ప్రవేశించారు.