: ఓయూలో టెన్షన్...వర్సిటీ బంద్ కు పిలుపిచ్చిన విద్యార్థులు, భారీగా మోహరించిన పోలీసులు
ఉస్మానియా యూనివర్సిటీలోని భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనపై విద్యార్థులు భగ్గుమన్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ చేసిన సదరు ప్రకటనపై నిన్న అన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థి సంఘాల నేతలు కూడా సీఎం ప్రకటనపై విస్మయం వ్యక్తం చేశారు. వర్సిటీ భూములను కాజేసేందుకే కేసీఆర్ సర్కారు, పేదలకు ఇళ్ల పేరిట దొడ్డిదారిన వర్సిటీలో ప్రవేశించేందుకు యత్నిస్తోందని వారు ఆరోపించారు. వర్సిటీతో పాటు వర్సిటీ భూములను కాపాడుకునేందుకు ఎంతదాకానైనా వెళతామని ప్రకటించారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రకటనకు నిరసనగా నేడు ఓయూ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే విద్యార్థుల స్పందన, బంద్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం... పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వర్సిటీ ముందు మోహరించింది. ఈ నేపథ్యంలో నేడు వర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు.