: వివాదం రేపిన మోదీ ట్వీట్... ప్రధానిపై విమర్శల వెల్లువ
సామాజిక మాధ్యమంలో ముందుండే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ ట్వీట్ పెను దుమారం రేపుతోంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. కేంద్రంలో తాము అధికారం చేపట్టకముందు భారత్ లో జన్మించిన వారుగా చెప్పుకునేందుకు మీరంతా సిగ్గుపడ్డారని, తాము పరిపాలన చేపట్టిన తరువాత భారతదేశ ప్రతినిధులమని చెప్పుకునేందుకు గర్వపడుతున్నారంటూ ఆయన చైనా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెను వివాదానికి కారణమైంది. ఆయన ట్వీట్ పై స్పందించిన కాంగ్రెస్, ప్రధాని స్థాయిని ఆయన దిగజారుస్తున్నారని, చెత్తరాజకీయాలకు పాల్పడకుండా ప్రధాని హోదాకున్న గౌరవాన్ని కాపాడాలని మోదీకి సూచించింది. భారతీయులం అని చెప్పుకునేందుకు ఎవరూ, ఎప్పుడూ సిగ్గు పడి ఉండరని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయే నంటూ సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.