: పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే నా దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు: కేసీఆర్
విశ్వవిద్యాలయ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటన చేస్తే కొంతమంది తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పేదల జీవితాల్లో మార్పులు రావడం వారికి ఇష్టం లేదని, దిష్టిబొమ్మలు కాలబెట్టేవాళ్లనే కొందరు నేతలు భుజాలకెత్తుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. యూనివర్శిటీలకు వేల ఎకరాల స్థలం అవసరంలేదన్న కేసీఆర్, ఉద్యానవర్శిటికీ 50 ఎకరాల స్థలం సరిపోతుందని ప్రధానికి చెప్పానన్నారు. పేదలకు న్యాయం చేసే విషయంలో వెనక్కి తగ్గనని, నిరుపేదలకు దశలవారీగా ఇళ్లు కట్టించి తీరుతానని సీఎం స్పష్టం చేశారు. ఓ పని మొదలుపెడితే మధ్యలో ఆపే ప్రసక్తే లేదని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు.