: దళిత మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించారు!
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో జరిగే అమానుషాలు అన్నీ ఇన్నీ కావు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలోని హరేవా ప్రాంతంలో ఓ యువతిని, దళిత యువకుడు ప్రేమించి తీసుకెళ్లిపోయాడని ఆగ్రహించిన పెద్దలు సభ్యసమాజం తలవంచుకునేలా, అతని కుటుంబంలోని ఐదుగురు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడు తమ కులానికి చెందిన అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని తెలిసిన వెంటనే ఆ గ్రామంలోని వెనుకబడిన వర్గానికి చెందిన వారు మరుసటి రోజు అతని కుటుంబానికి సంబంధించిన మహిళలపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ వారిని ఇళ్లల్లోంచి నడి వీధిలోకి లాక్కొచ్చారు. చెప్పులతో కొట్టి, ఘోరంగా అవమానించారు. అనంతరం వారి దుస్తులు లాగిపారేసి వారిని ప్రధాన రహదారిపై ఊరేగించారు. ఈ దారుణం ఐదు గంటలపాటు నిరాఘాటంగా కొనసాగింది. ఈ దారుణాన్ని ఆపే సాహసం ఎవరూ చేయలేదు. కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు గ్రామంలోకి వచ్చి యువతి తండ్రి సహా, నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది బయటకు పొక్కడంతో రాజకీయ పక్షాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.