: నా కుమార్తె 'పోల్ డ్యాన్సర్' అయినా ఓకే... డాక్టరును మాత్రం కానీయను: కేరళ వైద్యుడి సంచలన వ్యాఖ్య
చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు తమ అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటారు. వ్యాపారం రంగంలో ఉంటే దాన్నే ముందుకు తీసుకెళ్లాలని, ఉన్నతోద్యోగులైతే అటువంటి ఉద్యోగాల్లోనే స్థిరపడాలని భావిస్తారు. కానీ కేరళలోని ఈ డాక్టరు మాత్రం తన కుమార్తెను డాక్టరును మాత్రం కానివ్వబోనని తెగేసి చెబుతున్నారు. తన కుమార్తె బార్ లో పోల్ డ్యాన్సర్ వృత్తి ఎన్నుకున్నా అంగీకరిస్తానే తప్ప ఇండియాలో వైద్య వృత్తిని మాత్రం స్వీకరించనీయబోనని కేరళలోని ఓ ఆసుప్రతిలో అనస్థీషియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ రోషన్ రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. తన అభిప్రాయానికి సహేతుక కారణాలు కూడా చెప్పారు. మే 15న ఆయన ఈ పోస్ట్ పెట్టగా, ఇప్పటికే 20 వేలకు పైగా షేర్స్ వచ్చాయి. దీనిపై చర్చకు తెరతీస్తూ 'రెడ్డిట్ ధ్రెడ్' కూడా ప్రారంభమైంది. "డాక్టరు వృత్తి అంటే కుటుంబ జీవితాన్ని కోల్పోయినట్టే. కేటాయించిన పని గంటలకు రెండింతలు పని చేయాల్సి వస్తుంది. చాలినంత వేతనాలు ఉండవు. ఇంట్లో సుఖసంతోషాలు కొరవడతాయి. రోగుల మరణాలను ఆపాల్సిన డాక్టర్లు ఇప్పుడు వారి బంధువుల చేతుల్లో చావకుండా తప్పించుకునే మార్గాలు వెతకాల్సిన పరిస్థితి ఉంది. వృత్తి కోసం ప్రాణాలను తీసుకుంటామా? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2015లో ఇండియాలో వైద్య వృత్తిలో ఉన్నవారిలో 75 శాతం మంది ఏదో ఒక విధంగా రోగులు, వారి బంధువుల నుంచి హింసను ఎదుర్కొన్నవారే" అని ఆయన వాపోయారు. "నీకు ఎన్నో అవకాశాలున్నాయి. నీ మతం మార్చుకోవాలన్నా నీ ఇష్టం. నువ్వు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా మారి అమేజాన్ అడవుల్లో తిరగొచ్చు లేదా లాస్ వెగాస్ లోని బార్లలో పోల్ డ్యాన్సర్ గా మారవచ్చు. కానీ, నిన్ను ఇండియాలో వైద్య వృత్తిని మాత్రం చేపట్టనివ్వను. ఎందుకంటే, గత 20 ఏళ్లుగా నిన్ను పెంచింది నీ ఓటమిని చూసేందుకు కాదు" అంటూ రాథాకృష్ణన్ ముగించారు. ఇతర డాక్టర్లు కూడా తమ వృత్తిపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు.