: 42 ఏళ్లుగా కోమాలో ఉండి, మృత్యువు ఒడికి చేరుకుంది


ముంబైలోని కేఈఎం ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అరుణ షాన్ బాగ్ పై 1973లో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వార్డ్ బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అరుణ కోమాలోకి వెళ్లిపోయింది. గత 42 ఏళ్లుగా ఆమె కోమాలోనే ఉంది. అరుణకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ 2011లో రచయిత్రి, సామాజిక కార్యకర్త అయిన పింకీ విరానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె జీవితాన్ని ఆస్వాదించే స్థితిలో లేదని... ఆమెను ఈ దయనీయ స్థితిలో ఉంచే బదులు, ఆమెకు కారుణ్య మరణాన్ని ప్రసాదించడమే మేలని పిటిషన్ లో పేర్కొన్నారు. 'అరుణాస్ స్టోరీ' పేరుతో పింకీ ఒక పుస్తకాన్ని కూడా రచించారు. అయితే, పింకీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేఈఎం ఆసుపత్రి సిబ్బంది సైతం కారుణ్య మరణానికి అంగీకరించలేదు. 42 ఏళ్ల నుంచి ఆసుపత్రి సిబ్బంది అరుణను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి అరుణ షాన్ బాగ్ ఈ రోజు తుది శ్వాస విడిచింది. ఆ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. అరుణ మరణంతో ఆసుపత్రి సిబ్బందిలో విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News