: శేషసాయికి ఇన్ఫోసిస్ తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు!
ఇన్ఫోసిస్ చైర్మన్ గా కేవీ కామత్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం బోర్డు సభ్యుడిగా ఉన్న ఆర్.శేషసాయికి తాత్కాలిక నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) బ్యాంకు తొలి చైర్మన్ గా కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆయన బ్రిక్స్ కు వెళ్లే ముందే శేషసాయి ఎంపిక జరగవచ్చని సమాచారం. మరో రెండు మూడు వారాల్లో ఇందుకు సంబంధించిన అధికారిక వార్త వెలువడవచ్చని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. శేషసాయి ఇన్ఫీకి రాకముందు అశోక్ లేలాండ్ ఎగ్జక్యూటివ్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఆయనతో పాటు మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ పేరు కూడా తాత్కాలిక చైర్మన్ పదవికి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, శేషసాయికి సంస్థలో నాలుగేళ్లుగా అనుభవం ఉండడం ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారు. జూన్ 22న సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగేలోపే ఆయన పేరును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.