: ఒకే దెబ్బకు పది పిట్టలను కొట్టాలనుకుంటున్నా: కేంద్ర మంత్రి పీయుష్ గోయల్
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన బొగ్గు, విద్యుత్ మరియు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పొడవునా వార్తల్లో నిలిచిన పీయుష్ గోయల్ తన తదుపరి ప్రణాళికల వివరాలు పంచుకున్నారు. ఇండియాలో తొలి సారిగా ఈ-ఆక్షన్ విధానంలో బొగ్గు గనుల వేలాన్ని విజయవంతం చేసి ఖజానాకు వేల కోట్ల రూపాయలను జమ అయ్యేందుకు సహకరించిన ఆయన ఇకపై ఒకే దెబ్బకు పది పిట్టలను కొట్టేలా తన ప్లాన్ ఉంటుందంటున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో 1.75 లక్షల మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు పవర్ ట్రాన్స్ మిషన్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రైవేటు సంస్థలు పోటీ పడేలా వాతావరణాన్ని కల్పించడం, అన్ని రాష్ట్రాలనూ భాగస్వాములుగా చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలిపారు. విద్యుత్ రంగంలో పెట్టుబడుల పరిస్థితులను సరైన దిశగా నడిపించేందుకు గత సంవత్సర కాలంలో ఎంతో చేశామని తెలిపారు. ఇండియాలో ఇంకా 28 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదని గుర్తు చేసిన ఆయన డీజిల్ జనరేటర్లపై వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలను ఆదా చేయాల్సి వుందని అన్నారు. దేశీయ విద్యుత్ రంగంలో సమస్యలు ఉన్నందునే కేరళ మినహా ఏ రాష్టమూ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకోలేదని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పలు పెట్టుబడి అవకాశాలు అందిస్తున్న 'మేకిన్ ఇండియా' ప్రైవేటు రంగాన్ని ఆకర్షిస్తోందని, స్మార్ట్ మీటర్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, టవర్లు, కేబుల్స్, కండక్టర్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయని అభిప్రాయపడ్డారు. పాత విద్యుత్ తయారీ కేంద్రాలను అత్యాధునిక యూపీఎంపీ (అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు)లుగా మార్చాలన్న ప్రతిపాదన ఉందని పీయుష్ గోయల్ తెలియజేశారు.