: యువరాజ్ పైకి బ్యాటెత్తిన క్రిస్ గేల్!
అవును, యువరాజ్ సింగ్ పైకి కరీబియన్ సంచలనం క్రిస్ గేల్ బ్యాటెత్తాడు. అయితే కోపంగా కాదులెండి, సరదాగానే! నిన్న బెంగళూరులో ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఢీకొంది. బెంగళూరు జట్టుకు క్రిస్ గేల్ ఆడుతుంటే, ఢిల్లీ జట్టులో యువీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో ఇరు జట్లకు అంపైర్లు చెరో పాయింట్ ను కేటాయించారు. నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లగా, ఢిల్లీ ఇంటిబాట పట్టింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ సందర్భంగా గేల్, యువీల మధ్య సరదా సన్నివేశం జరిగింది. యువీపై గేల్ బ్యాటెత్తి కొట్టబోగా, యువీ కూడా తప్పించుకుంటూ గెంతాడు. ఈ దృశ్యాన్ని స్టేడియానికి వచ్చిన అభిమానులు ఆసక్తిగా తిలకించారు.