: అప్పుడు కంటిచూపు పోయింది... ఇప్పుడు స్పృహ తప్పింది... మిల్లర్ కొడితే అంతే!
ఐపీఎల్ తాజా సీజన్ లో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఈ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కొట్టిన సిక్స్ ఓ కానిస్టేబుల్ కన్ను పోగొట్టింది. ఇప్పుడదే ఆటగాడు ఓ బాలుడు స్పృహ కోల్పోవడానికి కారణమయ్యాడు. మొహాలీ స్టేడియంలో ప్రాక్టీసు సమయంలో మిల్లర్ పుల్ షాట్ ఆడగా బంతి వెళ్లి సిద్ధార్థ్ ఉపాధ్యాయ (10) అనే బాలుడి ఛాతీకి బలంగా తాకింది. దీంతో, ఆ బాలుడు కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయిన అతడిని ఓ పోలీసు స్టేడియంలో ఉన్న మెడికల్ రూంకు తరలించారు. కాసేటికి తేరుకున్న అనంతరం, ఛాతీలో నొప్పిగా ఉందనడంతో అతడిని పంజాబ్ క్రికెట్ సంఘం అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ చిన్నారి తన తండ్రితో కలిసి భోపాల్ నుంచి మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.