: సీఎం సాయంతో పెళ్లి తప్పించుకున్న మైనర్ బాలిక
దేశంలో వెలుగులోకి రాని మైనర్ బాలికల వివాహాలు ఎన్నో. కానీ, ఈ 17 ఏళ్ల జార్ఖండ్ బాలిక మాత్రం తెగువ ప్రదర్శించింది. తల్లిదండ్రులు చదువు ఆపేసి, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆ అమ్మాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను ఆశ్రయించింది. రాంచీలో ఓ సాంకేతిక విద్యా సంస్థలో ప్రథమ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న ఈ బాలిక శనివారం నాడు సీఎం గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చింది. ఆ సమయంలో రఘుబర్ దాస్ పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞాపనలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మైనర్ బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో, ఆయన వెంటనే స్పందించారు. బాలిక తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. మైనర్లకు పెళ్లి చేయడాన్ని చట్టం అంగీకరించదని స్పష్టం చేశారు. ఏవైనా ఆర్థిక ఇబ్బందులుంటే బాలిక చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. కాగా, ఇంతకుముందు కూడా దాస్ బాల్య వివాహాన్ని వ్యతిరేకించిన నాలుగో తరగతి విద్యార్థినికి నగదు అవార్డు ప్రకటించారు. అంతేగాకుండా, 'స్కూల్ చలే చలాయా అభియాన్' పేరిట బాలికా విద్యపై రాష్ట్రంలో విశేషంగా ప్రచారం చేస్తున్నారు.