: ఆ 12 కంపెనీలపై ఎల్ఐసీ ప్రేమ!


ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే సెన్సెక్స్-30లోని 12 కంపెనీలపై ఎల్ఐసీ ప్రేమ చూపుతూ, వాటిల్లో అధికంగా పెట్టుబడులు పెడుతోంది. కోల్ ఇండియా, బజాజ్ ఆటో సహా 12 కంపెనీల్లో సుమారు రూ. 16,400 కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను జనవరి -మార్చి మధ్యకాలంలో కొనుగోలు చేసింది. ఇదే సమయంలో మరో 12 కంపెనీల్లో పెట్టుబడుల మొత్తాన్ని తగ్గించుకుంది. తాజా గణాంకాల ప్రకారం యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థల్లో ఎల్ఐసీ తరపున ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేకపోగా, టాటా స్టీల్, బీహెచ్ఈఎల్, వేదాంత, టాటా మోటార్స్ సంస్థల్లో పెట్టుబడిలో మార్పు రాలేదు. బొగ్గు సంస్థ కోల్ ఇండియాలో ప్రస్తుతం ఎల్ఐసీ వాటా 4.65 శాతానికి పెరిగింది. మొత్తం రూ. 10,754 కోట్ల విలువైన ఎల్ఐసీ పెట్టుబడులు కోల్ ఇండియాలో ఉన్నాయి. ఇటీవల కోల్ ఇండియా ఆఫర్ సేల్ మార్కెట్ ను తాకినప్పుడు 28.47 కోట్ల వాటాలను ఎల్ఐసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇతర కంపెనీల్లో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్ టీ) సంస్థలో ఎల్ఐసీ వాటా 16.73 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత ఈక్విటీ లెక్కల ప్రకారం రూ. 16,400 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసిన ఎల్ఐసీ, రూ. 6,730 కోట్ల విలువైన వాటాలను విక్రయించి, నికరంగా రూ. 9,670 కోట్ల విలువైన వాటాలను తన కిట్టీలో వేసుకుంది. గెయిల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటో, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల్లో ఎల్ఐసీ వాటా పెరిగింది.

  • Loading...

More Telugu News