: రెండు వారాల వ్యవధిలో రూ. 17 వేల కోట్లు తీసేసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు


ఇండియాలో సంస్కరణల అమలు ఆలస్యం అవుతుందన్న సంకేతాలకు తోడు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధానంపై నెలకొన్న ఆందోళనలు విదేశీ ఇన్వెస్టర్లను భారత మార్కెట్ కు దూరం చేస్తున్నాయి. గడచిన రెండు వారాల వ్యవధిలో సుమారు రూ. 17 వేల కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ వాటాలను విక్రయించారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో రూ. 94,214 కోట్ల విలువైన పెట్టుబడులను ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ పీఐ) ద్వారా వచ్చినప్పటికీ, నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే మాత్రం వారి జోరు తగ్గినట్టు గణనీయంగా తెలుస్తోంది. జనవరిలో ఎఫ్ పీఐల పెట్టుబడి రూ. 33,688 కోట్ల వద్ద ఉండగా, ఫిబ్రవరిలో రూ. 24,564 కోట్లకు, మార్చిలో రూ. 20,723 కోట్లకు, ఏప్రిల్ లో రూ. 15,266 కోట్లకు దిగివచ్చింది. తాజా గణాంకాల ప్రకారం ఒక్క మే నెలలోనే ఇప్పటివరకూ రూ. 16,723 కోట్ల విలువైన పెట్టుబడులను వారు వెనక్కు తీసేసుకున్నారు. ఈ మొత్తంలో రూ. 7,635 కోట్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి, మరో రూ. 9,088 కోట్లు డెట్ మార్కెట్ నుంచి తరలించినట్టు ఎక్స్ఛేంజ్ వర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కనీస ప్రత్యామ్నాయ పన్నును 20 శాతం వరకూ విధించేలా నిర్ణయం వెలువడవచ్చన్న ఊహాగానాలతో తమ లాభాలు దెబ్బతింటాయని విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News