: హేమమాలిని కోసం ఎదురుచూస్తున్న బృందావనం!
గత సంవత్సరం నవంబర్ 7వ తేదీ. 65 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని తనదైన అందంతో అభిమానులకు మత్తెక్కించే వెటరన్ నటి, యూపీలోని మధుర నుంచి పార్లమెంటుకు ఎన్నికైన హేమమాలిని బృందావనానికి వచ్చారు. ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు 'స్వచ్ఛ భారత్'ను ప్రారంభిస్తూ, అక్కడి బన్కే బీహారీ మందిరం (కృష్ణ మందిరం) సమీపంలో చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ఆ సమయంలో ఆమెకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆమె పర్యటనకు మంచి కవరేజ్ కూడా వచ్చింది. కట్ చేస్తే... మే 2015. రాధా, కృష్ణులు నడయాడిన నేలగా చెప్పుకునే బృందావనం రహదార్లు ఇప్పుడు చెత్తా చెదారాలతో నిండిపోయాయి. మురుగు నీటి కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోయాయి. సమీపంలోని యమునా నది కాలుష్యంతో నిండిపోయింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోల కోసమే తప్ప వాస్తవంగా ఉపయోగపడింది లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఇదో గొప్ప నాటకం. హేమమాలిని వచ్చి చీపురు పట్టి ఫోటోలు తీయించుకుని వెళ్లిపోయారు" అని బృందావనంలో చెత్త సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నిరంతరంగా శ్రమిస్తున్న శుక్లా దుయ్యబట్టారు. హేమమాలిని మరోసారి ఇక్కడికి వచ్చి స్వచ్ఛ భారత్ దిశగా తన నిబద్ధతను నిరూపించుకోవాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.