: చెన్నై ‘సూపర్’ విక్టరీ... పంజాబ్ పై 7 వికెట్ల తేడాతో విజయం
ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ చేరిన ఆ జట్టు కొద్దిసేపటి క్రితం మోహాలీలో ముగిసిన లీగ్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత చెన్నై బౌలర్లు రాణిస్తే, ఆ తర్వాత బ్యాట్స్ మెన్ కూడా తమదైన శైలిలో పంజాబ్ పై విరుచుకుపడ్డారు. దీంతో 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ధోనీ సేన 16.5 ఓవర్లలోనే 134 పరుగులు చేసి విజయబావుటా ఎగురవేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆ తర్వాత 131 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై కూడా ఆదిలో తడబడింది. తొలి రెండు ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పది పరుగులకే హస్సీ (1), బ్రెండన్ మెకల్లమ్ (6) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్ (55) వీరవిహారం చేశాడు. సురేశ్ రైనా(41)తో కలిసి అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డూప్లెసిస్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 16 బంతులెదుర్కొన్న ధోనీ రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 25 పరుగులు రాబట్టి ఆజేయంగా నిలిచాడు. 16.5 ఓవర్లలోనే 134 పరుగులు చేసిన చెన్నై వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది.