: బీహార్ ముఖ్యమంత్రినే నిర్ఘాంత పరిచిన బుడతడి ఉపన్యాసం
ఆ బాలుడి పేరు కుమార్ రాజ్ చౌరాసియా... బీహార్ లో ఓ పాన్ వాలా కుమారుడు. అయితేనేం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అనర్గళంగా ప్రసంగించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ఘాంత పోయేలా చేశాడు. పాట్నాలోని ఎస్ కే మెమోరియల్ హాల్లో చౌరాసియా కుల సభ జరుగగా, అక్కడికి ముఖ్య అతిథిగా నితీష్ విచ్చేశారు. అంతకుముందు నుంచే, తనను మాట్లాడేందుకు అనుమతించాలని ప్లకార్డు పట్టుకొని తిరుగుతున్న బాలుడు అందరి దృష్టిలోకీ వెళ్లాడు. ముఖ్యమంత్రి రాగానే ఓ దండ పట్టుకుని వేదికపైకి వెళ్లబోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ధైర్యాన్ని కోల్పోని బుడతడు ప్లకార్డు ఎత్తి చూపుతూ నితీష్ దృష్టిలో పడేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. సుమారు అరగంట తరువాత కుమార్ ను గమనించిన నితీష్ వేదికపైకి పిలిపించారు. వేదికనెక్కి నితీష్ కు పూలమాల వేసిన అనంతరం మొదలైన బాలుడి ప్రసంగం అందరినీ ఆకర్షించింది. భోజ్ పూర్ జిల్లా నుంచి వచ్చిన కుమార్ ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నాడు. "ముఖ్యమంత్రిగారు మా కులం వారిని అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని భావిస్తున్నారు. అయితే, ఈ తరహా వ్యవస్థ అవసరం లేదని డిమాండ్ చేస్తున్నాను" అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, పేద విద్యార్థులు విద్యాభ్యాసం కోసం పడుతున్న కష్టాలు, ప్రైవేటు స్కూళ్లలో సాగుతున్న ఫీజుల దందా వంటి విషయాలను ఎన్నో ప్రస్తావించాడు. సభ నిర్వాహకులు ప్రసంగాన్ని ముగించాలని సూచిస్తే, నితీష్ కల్పించుకుని ఎంత సమయమైనా బాలుడు చెప్పదలచుకున్నది మొత్తం చెప్పేదాకా వేచి చూస్తానని చెప్పి, కుమార్ ను ప్రోత్సహించారు. "నేను ప్రధాని అయితే, దేశంలోని ప్రైవేటు పాఠశాలలన్నింటినీ మూసి వేయిస్తా. ఏ విద్యార్థికైనా ఒకే విధమైన విద్యను అందేలా చూస్తా. కేవలం కోటా అమలైతే విద్య అందినట్టేనా?" అని చౌరాసియా కుల పెద్దలను ప్రశ్నించిన బాలుడు, రిజర్వేషన్లు లేకుండా ఎదగలేమా? అని నిలదీశాడు. కుమార్ ప్రసంగం 10 నిమిషాలకు పైగా సాగగా, పలుమార్లు ఆహూతులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. ప్రసంగం ముగిసిన తరువాత నితీష్ స్వయంగా చిన్నారిని దగ్గరకు తీసుకుని, మెడలో దండ వేసి పొగిడారు. ఈ చిన్నారికి ఇన్ని విషయాలు ఎలా తెలుసునని బాలుడి తండ్రిని అడిగారు. చిన్నారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని ఆశీర్వదించారు.