: చైనాలో ఇంతమంది భారతీయులా?... ఆశ్చర్యపోయిన మోదీ!
"నమస్తే... చైనా దేశంలో ఇంతమంది భారతీయులున్నారా? ఇన్ని వేలమంది ఇక్కడున్నారా? నేనసలు అనుకోలేదు. సరిగ్గా సంవత్సరం క్రితం మే 16వ తేదీన ఇండియా ఇంకా నిద్ర నుంచి లేవకముందే మీరంతా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూశారు. ఇండియాలోని మిత్రులను వాకబు చేశారు. కష్టకాలం పోవాలని, అందుకోసం ప్రభుత్వం మారాలని మీరంతా కోరుకున్నారు" అంటూ షాంగైలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగానికి అడుగడుగునా చప్పట్లతో, 'మోదీ మోదీ' అన్న నినాదాలతో చైనా ఎన్నారైలు అభినందనలు తెలిపారు. ఏడాది క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఒకే స్వరంతో నినదించారని మోదీ అన్నారు. అంబేద్కర్ ఆశీస్సులు వుండడం వల్ల, కోట్లాది మంది ప్రజల కోరిక మేరకు తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించానని, సంవత్సరం తరువాత ప్రజలందరి ముందూ తలెత్తుకుని నిలబడగలిగానని అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో ప్రతి ప్రాంతంలోనూ భారతీయులు కనిపించారని వివరించారు. సమస్యలపై పోరాడటానికి గాంధీ సిద్ధాంతాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, ఎక్కడికీ విహార యాత్రలకు వెళ్లలేదని అన్నారు. రైల్లో టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధానిగా అయ్యాడని ప్రపంచమే ఆశ్చర్యపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, దేవుడు శక్తి ఇచ్చినంత కాలం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. సరిగ్గా సంవత్సరం పాలన తరువాత దేశానికి దూరంగా, చైనా గడ్డపై నుంచి తన బాధ్యతలకు పునరంకితం అవుతున్నట్టు మోదీ తెలిపారు. ఇవాళ షాంగై భూమిపై చిన్న హిందుస్థాన్ కనిపిస్తోందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఒకేసారి కలవడం తన అదృష్టమని అన్నారు.