: భారత్ ఎగుమతులు ఢమాల్!
వరుసగా ఐదవ నెలలోనూ భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. పెట్రోలియం తదితర ఉత్పత్తుల ధరల్లో వచ్చిన మార్పు కారణంగా గడచిన ఏప్రిల్ నెలలో భారత ఎగుమతులు 14 శాతం దిగజారి 22.05 బిలియన్ డాలర్ల (సుమారు 1.40 లక్షల కోట్లు)కు తగ్గాయి. ఏప్రిల్ 2014లో భారత్ నుంచి 25.63 బి. డాలర్ల (సుమారు రూ. 1.62 లక్షల కోట్లు) ఎగుమతి వాణిజ్యం నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఎగుమతి వాణిజ్య విలువ తగ్గుతూ వస్తోంది. కాగా, ఎగుమతి వాణిజ్యం తగ్గుతున్న దేశాల జాబితాలో భారత్ ఒంటరిగా లేదు. ఏప్రిల్ లో చైనా ఎగుమతి వాణిజ్యం 6.2 శాతం, కొరియా ఎగుమతులు 8.1 శాతం, తైవాన్ వాణిజ్యం 11.7 శాతం క్షీణించింది. ఇదిలావుండగా, ఏప్రిల్ లో దిగుమతుల వాణిజ్యం గత సంవత్సరంతో పోలిస్తే 35.7 బి. డాలర్ల (సుమారు రూ. 2.26 లక్షల కోట్లు) నుంచి 33.04 బి. డాలర్లకు (సుమారు రూ. 2.10 లక్షల కోట్లు) పడిపోయి 7.5 శాతం క్షీణతను నమోదు చేశాయి. దీంతో వాణిజ్య లోటు సైతం 9 శాతం పెరిగి 10.1 బి. డాలర్ల (సుమారు రూ. 64,205 కోట్లు) నుంచి 11 బి. డాలర్ల (సుమారు రూ. 70 వేల కోట్లు)కు పెరిగింది. ఇదే సమయంలో చమురు దిగుమతులు 42.65 శాతం పడిపోగా, బంగారం దిగుమతి 78 శాతం పెరిగింది. విలువైన రంగురాళ్లు, ఆభరణాల ఎగుమతులు 10 శాతం తగ్గాయని కేంద్ర గణాంకాలు వెల్లడించాయి.