: దేశ రాజధానిలో షాకింగ్ న్యూస్... ప్రజల ప్రాణాలతో చెలగాటం!
ఆసుపత్రులలో ఒకసారి వాడేసిన ఇంజక్షన్లు, ప్లాస్టిక్ సిరంజ్ లు తదితరాలను అత్యంత జాగ్రత్తగా నాశనం చేయాలని నిబంధనలు చెబుతున్నా 40కి పైగా ఫ్యాక్టరీలు వాటిని సేకరించి రీసైకిల్ చేస్తున్నాయని 'ఐయామ్ ఇన్' ఆన్ లైన్ పత్రిక నిర్వహించిన విచారణలో వెల్లడికావడం షాక్ నకు గురి చేసింది. ఢిల్లీలోని నారెలా ఇండస్ట్రియల్ ఏరియాలోని 40 ఫ్యాక్టరీలు బయోమెడికల్ వేస్ట్ ను రీసైకిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బయో మెడికల్ వేస్ట్ లో భయంకర అంటు వ్యాధులను కలిగించే క్రిములుంటాయని, ఇవి విషపూరితమని అధికారులు చెబుతున్నప్పటికీ, నీడిల్స్, మెడిసిన్ బాటిల్స్, రక్త నమూనాలు సేకరించే ప్లాస్టిక్ సీసాలు, ట్యూబులు తదితరాలను కరిగించి తిరిగి కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు సమాచారం. వీటితో డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు, ఐస్ క్రీం కప్పులు, వివిధ రకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. వీటిని వాడే వారికి ప్రమాదం పొంచివున్నట్టే. అంతకన్నా ముందు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య భద్రతపైనా నీలినీడలు అలముకొని ఉంటాయి. ప్రమాదకర అంటు రోగాల బారిన పడే ప్రమాదం వీరికి అధికం. ఒక్కో ఫ్యాక్టరీలో రోజుకు సరాసరిన 15 నుంచి 20 మంది పనిచేస్తున్నారు. దీంతో, బయో మెడికల్ వృథా నిర్వహణపై అధికారుల నియంత్రణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ తరహా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.