: బెంగళూరును దెబ్బతీస్తున్న వర్షం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వర్షం దారుణంగా దెబ్బతీస్తోంది. బెంగళూరు జట్టు టాప్ ఆర్డర్ భీకరమైన ఫాంలో ఉంది. క్రిస్ గేల్, డివిలియర్స్ భారీ షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండగా, కోహ్లీ సత్తా చాటుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి మిచెల్ స్టార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. బరిలోకి దిగిన ప్రతిసారీ ఫేవరేట్ గా బెంగళూరే పరిగణించబడుతోంది. ఈ నేపధ్యంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ వర్షార్పణం అయింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 200 పరుగులు చేసింది. విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్ రద్దవ్వడంతో ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. తరువాత ఈ నెల 13న ఫాం లేమితో సతమతమవుతున్న పంజాబ్ చేతిలో వర్షం కారణంగా పరాజయం పాలైంది. నేడు సన్ రైజర్స్ తో జరగాల్సిన మ్యాచ్ అకాల వర్షం కారణంగా లేట్ గా జరిగే అవకాశం ఉంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయోమయానికి గురవుతోంది. పొరపాటున మ్యాచ్ రద్దైతే దానికి బెంగళూరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉంటుంది. అందులో విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది. మ్యాచ్ రద్దైతే ఒక పాయింట్ తో హైదరాబాదు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.