: 'సాక్షి' టీవీ సిబ్బందికి చేదు అనుభవం
విశాఖలో సాక్షి టీవీ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకెళితే... దుబాయ్ పంపుతామంటూ గ్రాండ్ వెల్డ్ అనే సంస్థ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. వారిని దుబాయ్ పంపగా, అక్కడ వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఉద్యోగాలు లేవు సరి కదా, తిరిగి భారత్ వచ్చేందుకు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎలాగో సొంతగడ్డపై అడుగుపెట్టిన బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని 'సాక్షి' టీవీకి వివరించారు. దాంతో, వ్యవహారం ఏంటో తెలుసుకునేందుకు సాక్షి చానల్ కరస్పాండెంట్ వెంకట్, కెమెరామన్ సుధాకర్ వెళ్లారు. అయితే, వారికి అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. 'గ్రాండ్ వెల్డ్'కు చెందిన కొందరు వ్యక్తులు సాక్షి టీవీ సిబ్బందిని చావబాదారు. కెమెరాను ధ్వంసం చేశారు. బాధితుల పక్షాన విషయం కనుక్కుందామని వెళ్లిన 'సాక్షి' సిబ్బంది చివరికి తామే బాధితులవడం విచారకరం.