: చట్టప్రకారమే భూముల కొనుగోళ్లు...రాజకీయ దురుద్దేశంతోనే కేసులు: సోనియా అల్లుడు వాద్రా
హర్యానాలో భూవివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆ కేసుపై ఎట్టకేలకు నోరు విప్పారు. నిన్నటిదాకా కేసుపై వ్యాఖ్యానించేందుకు ససేమిరా అంటూ వచ్చిన వాద్రా, తాజాగా హర్యానా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఆయన ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. హర్యానాలో తనతో పాటు తన సంస్థల ఆధ్వర్యంలో జరిగిన భూముల కొనుగోళ్లు నిబంధనల మేరకే జరిగాయని ఆయన పేర్కొన్నారు. చట్టప్రకారమే భూములు కొనుగోలు చేశానని కూడా వాద్రా తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ కొనుగోళ్లపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయని ఆరోపించారు. అయితే తనతో పాటు తన సంస్థల ప్రతినిధులు కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తామని వాద్రా ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు నమోదైనా, దర్యాప్తులో హర్యానా పోలీసులు కక్షపూరిత ధోరణితో వ్యవహరించరని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.