: భావి రాష్ట్రపతి సుమిత్రా మహాజన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య!: పార్లమెంటులో ఆసక్తికర చర్చ


పార్లమెంటు సెంట్రల్ హాలులో నిన్న ఓ ఆసక్తికర చర్చకు తెర లేచింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీల పదవీ కాలం 2017లో ముగియనుంది. ఆ తర్వాత ఆ పదవులు చేపట్టేవారెవరంటూ జరిగిన ఈ చర్చలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్లు తెరపైకి రావడం బీజేపీ నేతలను కలవరపాటుకు గురి చేసింది. ఇప్పటికే పార్టీలో కురువృద్ధులుగా ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా దూరమైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు ఆ పదవులు చేపట్టవచ్చంటూ నిన్నటిదాకా ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఉన్నపళంగా వారిద్దరి పేర్ల స్థానంలో సుమిత్రా, వెంకయ్యల పేర్లు వినిపించడం పార్టీలో పెద్ద దుమారాన్నే రేపనుంది. ఇప్పటికే అద్వానీకి ప్రధాని నరేంద్ర మోదీ అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదన్న వాదన పార్టీలో చర్చనీయాంశమైంది. తాజాగా దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికీ అద్వానీని దూరం చేసేందుకు మోదీ యత్నిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతేకాక రాజకీయాల్లో ఇంకా వన్నె తగ్గని సుమిత్రా, వెంకయ్యల పేర్లు ఈ పదవుల రేసులోకి రావడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News