: మీకు కరెంటు... మాకు నీరు: టీ సీఎంకు చంద్రబాబు ఆఫర్!
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎప్పటికప్పుడు తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలపై స్పందిస్తున్న ఇరువురు నేతలు, ఒక్కోసారి కట్టుతప్పి రెచ్చగొట్టేరీతిలో ప్రకటనలు గుప్పించుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పాదన, నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల మధ్య ఆసక్తికర మాటల యుద్ధం సాగింది. అయితే ఈ తరహా వివాదాలకు భవిష్యత్తులో తావు లేకుండా ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్త ప్రతిపాదన చేశారు. నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా అవుకు మండలంలో ప్రసంగించిన సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కు బంపర్ ఆఫరిచ్చారు. ‘‘మాకు నీరివ్వండి... మీకు కరెంటిస్తాం’’ అంటూ ఆయన ప్రతిపాదించారు. శ్రీశైలంలో తెలంగాణ సర్కారు ఉత్పత్తి చేసే విద్యుత్ కు సరిసమానంగా తాము ఆ రాష్ట్రానికి ఇతర మార్గాల ద్వారా కరెంటును సర్దుబాటు చేస్తామని, అందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో నీటిని తమ రాష్ట్రానికి విడుదల చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి చంద్రబాబు ఆఫర్ కు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.