: ఏపీ భూసేకరణ జీవో వెనుక భయంకరమైన కుట్ర: సీపీఎం నేత బాబూరావు


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ జీవో 166 వెనుక టీడీపీ కుట్ర దాగి ఉందని సీపీఎం నేత బాబూరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, టీడీపీ చెబుతున్నట్టు ప్రపంచం మెచ్చిన రాజధాని నిర్మాణం జరిగే అవకాశం లేదు కనుక జీవో విడుదల చేస్తే, అక్కడి రైతులు భూసేకరణకు ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో రాజధాని ఎందుకు నిర్మించలేదని ఎవరైనా అంటే 'రైతులు సహకరించలేదు, అందుకే రాజధాని నిర్మాణం అనుకున్నట్టు చేయలేకపోయాం' అని చేతులు దులుపుకునే కుట్రను టీడీపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. లేని పక్షంలో 33 వేల ఎకరాలు భూసమీకరణ ద్వారా చేశామని చెప్పుకుంటున్న టీడీపీ, మాస్టర్ ప్లాన్ ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. జూన్ లేదా జులైలో రాజధానికి శంకుస్థాపన చేస్తామని చెబుతున్న టీడీపీ నేతలకు రాజధాని ప్రాంతంలో ఎక్కడ? ఏం చేస్తారు? అనే అవగాహన లేదని ఆయన తెలిపారు. 33 వేల ఎకరాలు సేకరించామని సంబరాలు చేసుకున్న ప్రభుత్వం కేవలం 10 వేల ఎకరాలకు సంబంధించిన కౌలు డబ్బులు చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 23 వేల ఎకరాల రైతులకు ఎందుకు కౌలు డబ్బులు చెల్లించలేదని ఆయన నిలదీశారు. వారంతా మాస్టర్ ప్లాన్ లో తమ ఇల్లు ఎక్కడ వస్తాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News