: ఇలాంటి అనుమతులతో ప్రజలను చంపేస్తారా?: అధికారులపై చిందులు తొక్కిన బీహార్ సీఎం
నేపాల్ లో సంభవించిన భూకంపమే కనుక బీహార్ లోని పాట్నాలో వస్తే క్షణాల్లో 5 లక్షల మంది మరణిస్తారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పాట్నాలో పర్యటించిన ఆయన వివిధ విభాగాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని చిన్న చిన్న సందుల్లో పెద్ద భవంతులు కట్టడానికి భద్రతా నిబంధనలు పక్కనపెట్టి అనుమతులు ఎలా మంజూరు చేశారని ఆయన నిలదీశారు. ఇలాంటి అనుమతులతో ప్రజలను చంపేస్తారా? అని ఆయన మండిపడ్డారు. నేపాల్ లో సంభవించిన భూకంపాలు మనకు గుణపాఠం కావాలని ఆయన అన్నారు. భూకంపాలు తట్టుకునేలా భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇంజనీర్లకు సూచనలు, శిక్షణ ఇప్పించాలని ఆయన పేర్కొన్నారు. నేపాల్ లో సంభవించిన భూకంపాలు బీహార్ లో సంభవించలేదు కనుక నష్టం సంగతి చెప్పలేమని, అదే వస్తే నిమిషాల్లో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.