: మహిళా విలేకరిపై ఫుట్ బాల్ ఫ్యాన్స్ చిలిపి చేష్టలు... ఆట చూడకుండా వారిపై నిషేధం
వారంతా ఫుట్ బాల్ వీరాభిమానులు. మాపిల్ లీఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ టెయిన్ మెంట్ (ఎంఎల్ఎస్ఈ) నిర్వహించిన టొరంటో ఎఫ్ సీ ఆటను చూసేందుకు స్టేడియానికి వచ్చారు. వారంతా బ్రహ్మచారులేమో... కోతి బుద్ధులు చూపారు. తమను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన మహిళా విలేకరితో చిలిపి చేష్టలకు పాల్పడ్డారు. వినేందుకు అసభ్యకరమనిపించే మాటలు మాట్లాడారు. తామంతా కెమెరా కంటికి దొరికిపోతామని అనుకోలేదేమో! మరో అభిమాని ఇంకో అడుగు ముందుకేసి మరింత నీచంగా మాట్లాడాడు. మహిళల పట్ల ఇంత చండాలంగా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించగా, ఇంగ్లండ్ లో ఇలాగే జరుగుతుంది అన్నాడు. సుహానా హంట్ అనే విలేకరి సిటీ చానల్ కోసం కవరేజ్ తీసుకుంటుండగా, ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ఎంఎల్ఎస్ఈ ప్రకటించింది. వీరి వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవమని, వారు పోటీలను తిలకించడాన్ని నిషేధిస్తున్నామని తెలిపింది. మహిళా జర్నలిస్టులకు మరింత సెక్యూరిటీని పెంచుతామని వివరించింది.