: 43 శాతం ఫిట్ మెంట్ కు అంగీకరించిన ఏపీ ప్రభుత్వం
రహదారి రవాణా సంస్థ కార్మికులు అడుగుతున్న 43 శాతం ఫిట్ మెంట్ కు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ మధ్యాహ్నం కార్మిక సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిపారు. ముందు నలభై శాతం ఇస్తామని మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పగా, పాత బకాయిలు రూ.100 కోట్లు కూడా ఇవ్వాలని నేతలు కోరారు. ఇందుకు ఎండీ విముఖత వ్యక్తం చేయగా, ఫిట్ మెంట్ విషయంలో 43 శాతంకు స్పష్టత వచ్చింది. దాంతో ప్రభుత్వంపై రూ.936 కోట్ల అదనపు భారం పడనుంది. దానిపై మరికాసేపట్లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. అటు 2013 ఏప్రిల్ నుంచి బకాయిలు ఇవ్వాలని కార్మిక నేతలు కోరారు. పాత బకాయిలు ఇస్తే ఆర్టీసీపై రూ.110 కోట్ల భారం పడుతుందని మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ ఎండీ అన్నారు. ఈ విషయంపైనే చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొంది.