: భూకంపం ముగ్గురు సీఎంలు, బీహార్ గవర్నర్ ను పరుగులు పెట్టించింది!
నిన్న నేపాల్ లో సంభవించిన భూకంపం భారత్ లోని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీహార్ గవర్నర్ ను పరుగులు పెట్టించింది. నేపాల్ లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి ఆ దేశ రాజధాని ఖాట్మండూలోని పార్లమెంట్ భవనం కంపించిపోయింది. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. భవనం కంపించడంతో భయకంపితులైన పార్లమెంట్ సభ్యులు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. ఇక నేపాల్ లో సంభవించిన ఆ భూకంపం తీవ్రతకు ఉత్తర బారతం సహా ఏపీలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఆ సమయంలో బీహార్ రాజధాని పాట్నాలోని తన అధికారిక నివాసంలో ఉన్న సీఎం నితీశ్ కుమార్ బయటకు పరుగులు పెట్టారు. భవనం ఒక్కసారిగా కంపించడంతో ఆయన తన సిబ్బందితో కలిసి బయటకు వచ్చేశారు. ఇక అదే సమయంలో పాట్నాలోని రాజ్ భవన్ లో గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ఓ పుస్తకావిష్కరణలో ఉన్నారు. రాజ్ భవన్ కూడా భూకంపం ధాటికి ఊగిపోవడంతో ఆయన బయటకు పరుగు పెట్టారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భూకంపం సమయంలో అధికారులతో సమీక్షలో ఉన్నారు. సమావేశం జరుగుతున్న భవనం కంపించడంతో అధికారులతో పాటు చౌహాన్ కూడా బయటకు పరుగు తీశారు. ఇక లక్నోలో అధికారిక పర్యటనలో ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, తానున్న భవనం నుంచి బయటకు పరుగులు పెట్టారు.