: ఇక ఒరాకిల్ వంతు... కేటీఆర్ చొరవతో హైదరాబాదులో కార్యకలాపాల విస్తరణకు సంసిద్ధత
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంచి ఫలితాలనే రాబడుతున్నారు. నిన్నటికి నిన్న గూగుల్ తో చర్చలు జరిపి, హైదరాబాదులోనే అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు వారిని ఒప్పించారు. తాజాగా ఆయన ఒరాకిల్ సంస్థ ప్రతినిధులను కూడా హైదరాబాదుపై మరింత ఆసక్తి కనబరిచేలా చేశారు. కొద్దిసేపటి క్రితం ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్, హైదరాబాదులోని సానుకూలాంశాలను, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. దీంతో ముగ్ధులైన ఒరాకిల్ బృందం హైదరాబాదులో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.