: ‘అన్న’గారి ఉత్తర్వు ‘అమ్మ’ను ఆ విధంగా కాపాడింది!
ముఖ్యమంత్రిగా దివంగత ఎన్టీ రామారావు జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ఒకటి తమిళనాడు మాజీ సీఎం జయలలితను అక్రమాస్తుల కేసులో నుంచి బయటపడేసింది. అది కూడా కర్ణాటక హైకోర్టు జారీ చేసిన సంచలన తీర్పు ఇందుకు వేదికైంది. వినడానికి విడ్డూరంగానే ఉన్నా, ఇది ముమ్మాటికీ నిజం. జయలలిత అక్రమాస్తుల కేసుపై ఇచ్చిన తీర్పులో కర్ణాటక హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అసలు విషమేమిటంటే, అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు, వంద కోట్ల రూపాయల భారీ జరిమానాకు గురైన తమిళనాడు మాజీ సీఎం జయలలితకు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చేలా నాలుగు రోజుల క్రితం సంచలనాత్మక తీర్పు చెప్పింది. జయలలితకు అసలు అక్రమాస్తులే లేవని కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఇందుకోసం ఏపీ సీఎంగా ఎన్టీఆర్ గతంలో జారీ చేసిన ఓ అధికారిక ఉత్తర్వును కోర్టు ఉదహరించింది. విధి నిర్వహణలో ఉన్న అధికారుల అక్రమాస్తులపై దర్యాప్తు చేసే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వేతనం కంటే ఏ ఒక్క రూపాయి అధికంగా ఉన్నా సదరు అధికారులపై కేసులు నమోదు చేసేది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు 1989లో నాటి ఏపీ సీఎం ఎన్టీఆర్ ను శరణువేడారు. ఏసీబీ అధికారుల తీరుతో తాము విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ఎన్టీఆర్, అధికారుల వేతనం కంటే ఓ 20 శాతం మేర అధికంగా ఆస్తులున్నా, అవి అక్రమాస్తుల కింద పరిగణించలేమని 1989, ఫిబ్రవరి 13న జీవో ఎంఎస్ నెంబర్:700 పేరిట అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. తాజాగా ఈ ఉత్తర్వును తన తీర్పులో ప్రస్తావించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి, జయలలితకు అక్రమాస్తులే లేవని తేల్చిచెప్పారు. ఈ కారణంగానే ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలనాడు సినీ వినీలాకాశంలో తనతో జతకట్టిన జయలలితను ఎన్టీఆర్ ఆ విధంగా ఈ జీవోతో బయటపడేశారన్న మాట!