: మౌనం వీడని జయలలిత... కర్ణాటక సర్కారు అప్పీలుపై ఆందోళన!


అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా బయటపడ్డారు. ట్రయల్ కోర్టు ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు, వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లవని, అసలు ఆమెపై మోపిన అభియోగాల్లో ఏ ఒక్కటి వాస్తవమనేందుకు ఆధారాలు లేవని కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం తీర్పు వెలువడినా, జయలలిత తన నివాసం నుంచి బయటకు రాలేదు. తీర్పును ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసిన ఆమె, సీఎం పదవి చేపట్టే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయనుండటమే జయ మౌనానికి కారణమని తెలుస్తోంది. తమకేమాత్రం సంబంధం లేని, పూర్తిగా తమిళనాడుకు సంబంధించిన వ్యవహారంపై తమ భూభాగంలో జరిగిన విచారణ కారణంగా రూ.100 కోట్ల మేర భారాన్ని తాము మోయాల్సి వచ్చిందని కర్ణాటక వాదిస్తోంది. ఈ మొత్తాన్ని తమకు చెల్లించాలని కోరుతోంది. అదే సమయంలో ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన బీవీ ఆచార్య హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ప్రతి అభియోగానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించామని చెబుతున్న ఆయన, కొన్ని అర్థమెటిక్ గణాంకాలను ఆసరా చేసుకుని ట్రయల్ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టివేసిందని వాదిస్తున్నారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టుకు చెబుతామని కూడా ఆయన పేర్కొన్నారు. బీవీ ఆచార్య ప్రకటనను గమనించిన జయలలిత మరింత భయాందోళనకు గురవుతున్నారట. బీవీ ఆచార్య చెబుతున్న దాని ప్రకారం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న జయలలిత, ఈ విషయం తేలేదాకా సీఎం పదవికి దూరంగా ఉండటమే మంచిదని భావిస్తున్నారట. దీంతోనే ఆమె పోయెస్ గార్డెన్ గడప దాటడం లేదని కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News