: మాకు ఓట్లేయలేదుగా... మీ పనులెట్లా చేస్తాం?: నోరుజారిన టీ మంత్రి చందూలాల్
ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించే ప్రజాప్రతినిధులు తాము ఎన్నికైన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది బాట పట్టించాలి. ఈ విషయంలో ఎలాంటి భేదభావం చూపడానికి తావు లేదు. అయితే తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాత్రం ఈ విషయాన్ని మరిచినట్లున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామం తనకు ఓట్లేయలేదని భావించిన ఆయన ‘‘మీరు మాకు ఓట్లేయలేదు కదా, మీ పనులెట్లా చేసి పెడతా?’’ అంటూ నిలదీశారు. అంతేకాక, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తైన తర్వాత కాని మీ పనులను చేసేది లేదంటూ ఆయన ఒకింత విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఆనక తాను మంత్రినన్న విషయం గుర్తుకు వచ్చిన చందూలాల్ నాలిక్కరుచుకున్నారు. సదరు గ్రామానికి చెందిన పెద్దలను పిలిపించుకుని తన ఆవేదనను వారికి వివరించారు. ఆ తర్వాత గ్రామానికి మంజూరైన రోడ్డు పనులను ప్రారంభించారు. వరంగల్ జిల్లా ములుగు మండలం కన్నాయిగూడెంలో నిన్న ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.