: శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు అవసరం ఉంది: కేసీఆర్
హైదరాబాద్ వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఉపయోగపడేలా మెట్రో రైలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఫలక్ నుమా, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు అవసరముందన్నారు. ఈ లైన్ లో మెట్రో రైలు వేయాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. భూసేకరణ, పునరావాసం, రోడ్ల వెడల్పు వంటి పనులను ప్రభుత్వమే చేపడుతుందని సీఎం తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో నగర మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ అండ్ టీ సీఈవో వీఎన్ గాడ్గిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్ధ హైదరాబాద్ మెట్రో రైలుకు కల్పించాలన్నారు. మెట్రోరైలుకు విద్యుత్ సబ్సిడీ అందించేందుకు సీఎం అంగీకరించారు. నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్ఆర్ నగర్ మెట్రో ట్రయల్ రన్ పనులు విజయవంతమయ్యాయని అధికారులు తెలపగా సీఎం అభినందించారు.