: క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారిని కాసేపట్లో కలవనున్న జూ.ఎన్టీఆర్
ఆ చిన్నారి పేరు శ్రీనిధి. వయసు 10 సంవత్సరాలు. స్కూలుకు వెళుతూ, హాయిగా ఆడుకోవాల్సిన వయసులో ఆ చిన్నారిని క్యాన్సర్ మహమ్మారి కబళించింది. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న రాందేవ్ ఆసుపత్రిలో శ్రీనిధి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది. ఆ చిన్నారికి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన అభిమానం. అతని యాక్షన్, డ్యాన్సులు అంటే చాలా ఇష్టం. తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను చూడాలనే కోరకను శ్రీనిధి తన తండ్రి వద్ద అనేక సార్లు వెలిబుచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎన్టీఆర్ చలించిపోయాడు. వెంటనే శ్రీనిధిని కలసి, ఆమెతో గడపడానికి రెడీ అయిపోయారు. తన నివాసం నుంచి బయలుదేరిన జూనియర్ కాసేపట్లో రాందేవ్ ఆసుపత్రికి రానున్నారు. దీంతో, ఆసుపత్రి వద్ద కోలాహలం నెలకొంది. ఎన్టీఆర్ కోసం శ్రీనిధి ఎదురుచూస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి తండ్రి శివాజీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. కూతురు వైద్య చికిత్స కోసం హైదరాబాదుకు మకాం మార్చి, ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. సాధారణ వ్యక్తి అయిన శివాజీకి ఎన్టీఆర్ ను చూడాలన్న తన కూతురు కోరికను ఎలా తీర్చాలో అర్థం కాలేదు. ఎన్టీఆర్ ను ఎలా కలవాలో కూడా అతనికి తెలియదు. కానీ, కూతురు కోరిక ఎలాగైనా తీర్చాలనే తపనతో తండ్రి హృదయం తల్లడిల్లింది. దీంతో, తన కోరికను ఫేస్ బుక్, ట్విట్టర్ లో తెలిపారు శివాజీ. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే స్పందించి, తాను శ్రీనిధిని కలుస్తున్నట్టు శివాజీకి తెలిపారు.