: విజయనగరం జిల్లాలో దొంగల బీభత్సం...విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్యోగిని హత్య
విజయనగరం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. విద్యుత్ సబ్ స్టేషన్ పై దాడి చేసి విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగిని పొట్టనబెట్టుకున్నారు. మరో ఉద్యోగినిని తీవ్రంగా గాయపరిచారు. వివరాల్లోకెళితే... జిల్లాకు చెందిన ఎస్.కోటలోని విద్యుత్ సబ్ స్టేషన్ లోకి నిన్న రాత్రి చొరబడ్డ దొంగలు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు స్వాతి, పార్వతిలపై దాడి చేశారు. స్వాతి ముఖంపై గోనెపట్టా కప్పి బయటకు ఈడ్చుకువచ్చారు. అనంతరం పార్వతిని సైతం బయటకు లాక్కుని వచ్చి ఇద్దరి మెడల్లోని పుస్తెల తాడులతో పాటు చెవి దుద్దులను బలవంతంగా లాక్కున్నారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన స్వాతి ముఖంపై దొంగలు పిడిగుద్దులు గుద్దారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. పార్వతిపైనా దొంగలు చేయి చేసుకున్నారు. దొంగల దాడితో భీతావహురాలైన పార్వతి నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది. తమ పని ముగించుకుని దొంగలు వెళ్లిన మరుక్షణమే పార్వతి మేల్కొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కూడా వేగంగానే స్పందించినా అప్పటికే స్వాతి ప్రాణాలు కోల్పోయింది. దాడి ఘటనపై వివరాలు సేకరించిన పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.