: తెలంగాణ పరిశ్రమ ‘రేయాన్స్’కు జీవం పోస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు!
అదేంటీ, తెలంగాణ పరిశ్రమకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జీవం పోయటమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఎంతైనా పొరుగు రాష్ట్రం. సోదర తెలుగు ప్రజలున్న మరో రాష్ట్రం కదా. అంతేకాక ఒకప్పుడు తాను సీఎంగా పాలించిన ప్రాంతం కావడం కూడా చంద్రబాబు ఈ తరహా నిర్ణయానికి కారణమై ఉండొచ్చు. ఇవన్నీ పక్కనబెడితే, గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్వయంగా వచ్చి ఆదుకోమని అడిగితే చంద్రబాబు కాదనలేకపోయారు. టీఆర్ఎస్ లోకి వెళ్లి ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కడియం అంటే చంద్రబాబుకు అభిమానం కాస్త ఎక్కువే. అసలు విషయం ఏంటంటే, వరంగల్ జిల్లాలో కాగితం తయారు చేసే రేయాన్స్ కంపెనీ దాదాపుగా మూతపడింది. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ తిరిగి బతకాలంటే, కాగితం తయారీకి అవసరమైన ముడిసరుకు సుబాబుల్ వృక్షాలు కావాలి. తెలంగాణలో అవి లేవు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో విస్తారంగా ఈ చెట్లు ఉన్నా, ఎగుమతి నిషిద్ధం. ఇక ఉన్న ప్రత్యామ్నాయ మార్గం ఏపీనే. ఏపీలోని తీర ప్రాంతం సుబాబుల్ వృక్షాలకు ప్రసిద్ధి. అదే తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం వైపు అడుగులు వేయించింది. మొన్న టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావుతో కలిసి కడియం చంద్రబాబును కలిశారు. సుబాబుల్ దుంగలను ఎగుమతి చేసి రేయాన్స్ ను అదుకోవాలని విన్నవించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు కడియం వినతికి సానుకూలంగా స్పందించారు. అంతేకాదు, కడియం అడగకున్నా, సుబాబుల్ ఎగుమతిపై ఉన్న 14.5 శాతం వ్యాట్ ను ఏకంగా 5 శాతానికి తగ్గించేశారు. ఈ మేరకు నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో ఏపీ నుంచి సుబాబుల్ దుంగలు తెలంగాణకు తక్కువ ధరకే నిరంతరాయంగా అందనున్నాయి. దీంతో రేయాన్స్ బతికి బట్టకట్టినట్టేనన్నమాట.