: చంద్రబాబుకు త్వరలో బుల్లెట్ ప్రూఫ్ బస్సు... ఖరీదు రూ.5.05 కోట్లు


బుల్లెట్ ప్రూఫ్ వాహనం... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు పునర్జన్మ ఇచ్చింది. గతంలో సీఎం హోదాలోనే తిరుమల వెళుతున్న ఆయనపై మావోయిస్టులు జరిపిన దాడిలో బుల్లెట్ ప్రూఫ్ గా తీర్చిదిద్దిన అంబాసిడర్ కారే ఆయన ప్రాణాలను కాపాడింది. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు మావోల క్లెమోర్ మైన్ దాడికి గాల్లో అంతెత్తున పైకి లేచి పడింది. అయినా చంద్రబాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంతేకాక అదే కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఆ తర్వాత మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్న భావనతో చంద్రబాబు కోసం తెలుగుదేశం పార్టీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తయారు చేయించింది. స్కార్పియో రకానికి చెందిన ఈ వాహనం కోసం 2004 ఎన్నికలకు ముందు ఆ పార్టీ దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసిందని నాడు వార్తలొచ్చాయి. పదేళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయింది. రాజధాని కూడా లేని ఏపీకి సీఎం అయిన చంద్రబాబు పల్లెలు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రత కోసం ప్రభుత్వం ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ బస్సును తయారు చేయిస్తోంది. ఇందుకోసం రూ.5.05 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ సూచనల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ బస్సు కోసం 25 శాతం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో రూ.2.52 కోట్లను విడుదల చేస్తూ నిన్న సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బస్సు తయారీని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు ఈ బస్సులోనే తిరగనున్నారు.

  • Loading...

More Telugu News