: సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఇంట విషాదం.... రైలు ఢీకొని సోదరుడి మృతి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత కిలివేటి సంజీవయ్య ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు సుజయ్ రైలు ఢీకొని మరణించాడన్న విషయం ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకెళితే... ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుజయ్ వివాహితుడు. ప్రస్తుతం భార్య పుట్టింట్లో ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఇంటినుంచి వెళ్లిన సుజయ్ తిరిగిరాలేదు. అదే రోజున రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొనడంతో సుజయ్ మరణించాడు. కానీ, అతడు ఎవరన్నది పోలీసులకు తెలియకపోవడంతో పోస్టుమార్టం జరిపించి, ఆ మరుసటి రోజే ఖననం చేశారు. కాగా, సుజయ్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న కుటుంబ సభ్యులకు సూళ్లూరుపేట రైల్వే పోలీసులు కొన్ని ఫొటోలు చూపించారు. అందులో ఉన్నది సుజయ్ కావడంతో వారి గుండె పగిలినంత పనైంది. సోదరుడి మృతితో ఎమ్మెల్యే సంజీవయ్య విషాదంలో మునిగిపోయారు. ఆయనను కలిసిన వైసీపీ నేతలు తమ సానుభూతి తెలిపారు.