: మా ఇద్దరి మధ్య బంధం వాస్తవమే... వచ్చే ఏడాది కత్రినాను పెళ్లాడతా: రణబీర్ కపూర్
బాలీవుడ్ లో మరో ప్రేమజంట పెళ్లి పీటలు ఎక్కనుంది. బాలీవుడ్ లో టాప్ స్టార్లుగా కొనసాగుతున్న రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నారట. ఈ విషయాన్ని రణబీర్ కపూరే స్వయంగా ప్రకటించాడు. తమ మధ్య కొనసాగుతున్న ఎఫైర్ పై జరుగుతున్న ప్రచారానికి తాజా ప్రకటనతో అతడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ‘‘మా ఇద్దరి మధ్య బంధం గురించి బయట అనుకుంటున్నవి వాస్తవమే. ఇప్పుడైనా మా ప్రేమను బహిర్గతం చేయాలి. లేదంటే, అది మా బంధాన్ని అగౌరవపరిచినట్లే’’ అని రణబీర్ చెప్పాడు. ప్రస్తుతం సినిమాల్లో ఇద్దరమూ బిజీగా ఉన్నామని, వచ్చే ఏడాడి ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నామని అతడు ప్రకటించాడు. ఈ మేరకు కత్రినా, తాను కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని అతడు పేర్కొన్నాడు.