: సంచలనం రేపనున్న మాజీ సీఎం కిరణ్... విభజన సమయంలో తెరవెనుక రాజకీయాలపై పుస్తకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నారా? అవుననే అంటోంది ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా'. పత్రిక తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్ర విభజన సమయంలో తెర వెనుక ఎంతో మంత్రాంగం జరిగిందని చెబుతున్న కిరణ్... ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ ఓ పుస్తకం రాస్తున్నారు. దాదాపు 400 పేజీలు ఉండే ఈ పుస్తక రచన చివరి దశకు చేరుకుంది. విభజన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ ప్రాంతీయ పార్టీల అధినేతలు అనుసరించిన ద్వంద్వ విధానాలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. ఏయే నాయకుడు ఏమేం చేశారన్న వాస్తవాలు ఈ పుస్తకంలో ఉండబోతున్నాయి. వీటన్నింటికీ డాక్యుమెంటరీ ఆధారాలు కూడా ఉన్నాయని కిరణ్ తెలిపినట్టు పత్రిక వెల్లడించింది. అప్పటి ప్రధాని మన్మోహన్, సోనియా, యూపీఏ మంత్రుల చర్చల విషయాలను కూడా పుస్తకంలో పేర్కొంటున్నారు కిరణ్. అదే విధంగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ కు పంపిన నివేదికలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లిపోయారు. ఈ పుస్తకంలో ఎక్కువ భాగాన్ని అక్కడే రాశారు. మరో నెలలో ఈ పుస్తకం పూర్తి కానుంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్... ఎక్కువ కాలాన్ని కుటుంబంతో గడపడం, గోల్ఫ్ ఆడటం ద్వారా గడిపేస్తున్నారు. అయితే, ఇంకా పేరు పెట్టని తన పుస్తకం రీలీజ్ అయిన తర్వాత కిరణ్ మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.