: మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను బెదిరిస్తున్న వివాదాస్పద జస్టిస్ కర్ణన్


మద్రాసు హైకోర్టులో విచిత్రమైన సంక్షోభం నెలకొంది. ఏకంగా చీఫ్ జస్టిస్ సంజయ్ కౌల్ ను బెదిరిస్తున్నారు జస్టిస్ సి.ఎస్.కర్ణన్. చీఫ్ జస్టిస్ తన విధుల్లో అనవసరంగా కలగజేసుకుంటూ, అంతరాయం కలిగిస్తున్నారంటూ కర్ణన్ ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని తెలిపారు. కోర్టు వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారంటూ కౌల్ పై అభియోగాలు మోపుతానని... అంతేగాకుండా, చీఫ్ జస్టిస్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతానని హెచ్చరించారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కూడా కోరాతానని అన్నారు. కర్ణన్ వ్యవహారంతో మద్రాస్ హైకోర్టులో తీవ్ర సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో, రిజిస్ట్రార్ జనరల్ ద్వారా మద్రాసు హైకోర్టు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ కర్ణన్ క్రమశిక్షణను ఉల్లంఘించారని సుప్రీంకు తెలిపింది. చీఫ్ జస్టిస్ అధికారాన్నే సవాల్ చేస్తున్నారంటూ ఆరోపించింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు రేపు విచారణకు రానుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు అధ్యక్షత వహించనున్న బెంచ్ ఈ కేసును విచారించనుంది. అసలు, ఈ గొడవకు మూల కారణం ఓ కమిటీ నియామకమే. సివిల్ జడ్జిల నియామకం కొరకు చీఫ్ జస్టిస్ సంజయ్ కౌల్ ఓ కమిటీని నియమించారు. అందులో జస్టిస్ ఆర్.సుధాకరన్, జస్టిస్ ధనపాలన్, జస్టిస్ హరి పరంధామన్, జస్టిస్ మాల, జస్టిస్ కిరుబాకరన్ లను సభ్యులుగా నియమించారు. వారితో పాటు ఆ కమిటీలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు, ఇతర అధికారులకు కూడా చోటు కల్పించారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి 21 వరకు సివిల్ జడ్జిల నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అయితే, కమిటీ నియామకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తాను ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నానని ఏప్రిల్ 16న హైకోర్టు జడ్జి హోదాలో జస్టిస్ కర్ణన్ ప్రకటించారు. ముఖ్యంగా, జస్టిస్ ధనపాలన్ నియామకం చెల్లదని, న్యాయ విద్యకు సంబంధించి ఆయన బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని కర్ణన్ ఆరోపించారు. అంతేగాకుండా, సమానత్వం పాటించకుండా, ఒకే వర్గానికి చెందిన కొందరికి కమిటీలో చోటు కల్పించారని కూడా కర్ణన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, సదరు కమిటీ ఇంటర్వ్యూలు చేయరాదని, కమిటీకి ఆ అర్హత లేదని ఆదేశాలిచ్చారు. అయితే, అటు తిరిగి, ఇటు తిరిగి ఈ వ్యవహారం చివరికి చీఫ్ జస్టిస్ సంజయ్ కౌల్ ముందుకు విచారణకు వచ్చింది. దీంతో, ఆయన జస్టిస్ కర్ణన్ ఆదేశాలపై స్టే ఇచ్చారు. ఈ స్టే విషయంలోనే కర్ణన్ ఆగ్రహానికి లోనయ్యారు. తన విధులకు కౌల్ అడ్డుతగులుతున్నారని, దళితుడిని అయినందునే వేధిస్తున్నారని, చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు దిగారు.

  • Loading...

More Telugu News