: ప్రేమించలేదు సరికదా, పెద్దలకు ఫిర్యాదు చేసిందని కాల్చేశాడు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదు సరికదా, వెంటపడుతున్నానని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో 16 ఏళ్ల బాలికను కాల్చి చంపాడో ప్రేమికుడు. యూపీలోని మీరట్ లో హిమాంశి (16) ని ప్రేమిస్తున్నానంటూ బ్యూటీ పార్లర్ నిర్వహించే యోగేంద్ర (22) వేధింపులకు దిగేవాడు. అతని ప్రేమను హిమాంశి తిరస్కరించడంతో తట్టుకోలేకపోయాడు. అయినప్పటికీ ఆమె వెంటపడడం మానలేదు. దీంతో నిత్యం అతడి ఘన కార్యాలను తన తాత బల్జీత్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులకు వివరించింది. దాంతో వాళ్లు యోగేంద్ర కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, అతడిని అదుపులో ఉంచాలని సూచించారు. దీనిని అవమానంగా భావించిన యోగేంద్ర, స్కూలు నుంచి ఇంటికి వస్తున్న హిమాంశిని వెనుకనుంచి తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యోగేంద్రను జైలుకు తరలించారు.