: సమ్మె అక్రమం... ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలి: హైకోర్టు ఆదేశం
ఆర్టీసీ సమ్మెపై టీడీపీ నేత సీఎల్ వెంకట్రావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా, సమ్మె అక్రమమని, ఆర్టీసీ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ సమ్మెపై నిషేధాలున్నాయని, ఈ సమయంలో సమ్మె చేయడం అత్యవసర సేవలకు భంగం కలిగించినట్టేనని పేర్కొంది. దాంతో నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లో చేరక తప్పేలాలేదు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. 43 శాతం ఫిట్ మెంట్ కోసం పట్టుబడుతూ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపి 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తామన్నా కార్మికులు దిగిరావడంలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఊరట లభించినట్టయిందని చెప్పచ్చు.