: మదర్స్ డే స్పెషల్: తల్లులకు ఎదురయ్యే ఐదు ప్రధాన సమస్యలివే!
'అమ్మా' అని పిలిపించుకోవడం ఓ మహిళ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. అందుకే మాతృత్వపు అనుభూతి కోసం ప్రతి స్త్రీ పరితపిస్తుంది. ఓ తల్లిగా, ఇల్లాలిగా, సేవకురాలిగా, పిల్లలను క్రమశిక్షణతో పెంచే బాధ్యతలు భుజాన మోస్తూ, ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకుని కాపాడే తల్లి రుణం తీర్చుకోలేనిది. తల్లి కావడం అంటే అంత సులభం కాదు. అదే తొలిచూలు కాన్పు అయితే మరింత కష్టం. ప్రాణాలకు తెగించి మరీ మహిళ తల్లవుతుంది. రేపు మదర్స్ డే సందర్భంగా నేటి తరం తల్లులు ఎదుర్కొంటున్న ఐదు ప్రధాన సమస్యల గురించి తెలుసుకుందాం. పాలివ్వడమే మొదటి సమస్య: బిడ్డ పుట్టగానే తల్లి పాలు తాగించాలని ప్రతి డాక్టరూ చెబుతాడు. కానీ, అది ఆ అమ్మకు కాస్తంత కష్టమైన పనే. అప్పుడే పుట్టిన బిడ్డకు పాలివ్వడం బాధను కలిగిస్తుంది. పాలు పడకపోవడం, చను మొనలను బిడ్డ సరిగ్గా పట్టుకోలేకపోవడం, అలవాటులేని పని అయినందువల్ల పాలు ఇస్తున్నప్పుడు, ఆ తరువాత స్త్రీకి కొన్ని ఇబ్బందులు సహజం. ఇవి పరిష్కారం కావడానికి కొంత సమయం పడుతుంది. దీనికితోడు ప్రాక్టీస్ చేస్తే ఇది చిన్న సమస్యగానే తీసిపారేయవచ్చు. పాలివ్వడంలో సమస్యలు ఏర్పడితే వెంటనే నిపుణులను సంప్రదించాలి. లేకుంటే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదాలు అధికం. ఇక రెండో సమస్య నిద్రలేమి: బిడ్డ పుట్టిన తరువాత తొలి ఆరు నెలలూ రాత్రుళ్లు అమ్మకు నిద్రే ఉండదు. బిడ్డ ఎప్పుడు లేస్తాడో? ఎప్పుడు ఏడుస్తాడో?... తెలియని స్థితిలో నిద్ర కరవవుతుంది. ప్రతి గంటకూ లేచే బిడ్డ తల్లిని అసలు పడుకోనివ్వడు. దీనివల్ల అలసట, స్థూలకాయం, నిరాశ, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభించడం, వీలున్నప్పుడల్లా కునుకు తీయడం వంటి వాటితో ఈ సమస్యను కూడా సులువుగా అధిగమించవచ్చు. లావుగా కనపడటం: సంవత్సరం క్రితం వరకూ నాజూగ్గా ఉన్న శరీరం బిడ్డ పుట్టిన తరువాత ఒక్కసారిగా లావుగా కనిపిస్తుంది. గర్భిణీగా ఉన్న సమయంలో శరీరంలో జరిగే మార్పుల కారణంగానే ఇలా అవుతుంది. ఈ విషయంలో సినిమా తల్లులను టీవీల్లో చూసి వారిలా ఉండలేకపోయామే అని బాధపడకూడదు. బరువు వెంటనే తగ్గాలని అసలు ప్రయత్నం చేయరాదు. తేలికపాటి వ్యాయామాలు, యోగా వంటి వాటితో తల్లులు తిరిగి తమ మునుపటి నాజూకుదనాన్ని పొందవచ్చు. తిరిగి విధుల్లోకి వెళ్లాలా? వద్దా?: ఉద్యోగం చేస్తూ, మెటర్నిటీ సెలవుపై వచ్చి బిడ్డ పుట్టిన తరువాత ఏర్పడే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఇంట్లో కన్న బంధం, మరోవైపు ఉద్యోగ బాధ్యత. మళ్లీ విధుల్లోకి వెళ్లాలి అనుకుంటే చిన్నారిని వదిలి వెళ్లడం చాలా ఇబ్బందికర పరిణామమే. ఈ విషయంలో ఇతర మహిళలను, అందునా తల్లులను ఆదర్శంగా తీసుకోవాలి. కొన్ని నెలల పాటు పనిగంటలను అనుకూలంగా ఉండేలా మార్చుకోవాలి. ఇంట్లో పెద్దలుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. మీ కోసం సమయం కేటాయించే పరిస్థితి ఉండదు: కొత్తగా ఒడిలో చేరిన బిడ్డను 24 గంటలూ కాపాడాల్సి వుండడంతో కనీసం రెండేళ్ల పాటు తనకోసం సమయం కేటాయించే పరిస్థితి తల్లికి ఉండదు. ఇదే సమయంలో ఇంటి పనులు కూడా చూసుకోవాల్సి వుండడం జీవితాన్ని మరీ బిజీగా మార్చివేస్తుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. ఏదిఏమైనా అర్థం చేసుకుని సహకరించే వాళ్లుంటే ఇటువంటి సమస్యలు ఎన్నయినా దాటుకొని ముందుకు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.