: సల్మాన్ సినిమాలకు బీమా చెయ్యలేమని చేతులెత్తేసిన కంపెనీలు
'హిట్ అండ్ రన్', 'కృష్ణ జింకల వేట కేసు', 'డ్రగ్స్ సేవించిన కేసు' తదితరాల్లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చిత్రాలకు బీమా చేసేందుకు కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. వివిధ కేసుల్లో ఎప్పుడు ఎటువంటి శిక్ష పడుతుందో తెలియని ఆయనపై చిత్ర పరిశ్రమ సుమారు రూ. 200 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు బీమా చేయించుకోవాలని నిర్మాతలు భావిస్తుండగా, సల్మాన్ జైలుకు వెళ్లిన పక్షంలో జరిగే నష్టానికి బాధ్యత వహించమన్న నిబంధనను బీమా కంపెనీలు చేరుస్తున్నాయి. ఒకవేళ సల్మాన్ షూటింగుకు హాజరుకాలేకపోయిన పక్షంలో జరిగే నష్టానికి పరిహారం చెల్లించమని చెబుతున్నాయి. సల్మాన్ కేసులో థర్డ్ పార్టీ క్లయిములు కూడా చెల్లవని ఇన్స్యూరెన్స్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. సల్మాన్ కారు నడిపిన సమయంలో తాగి ఉండడం, లైసెన్స్ లేకపోవడంతో ఆయన వల్ల గాయపడిన వారు ఇప్పుడొచ్చి క్లయిమ్ చేసినా పరిహారం ఇవ్వబోమని వెల్లడించాయి. కాగా, దబాంగ్-3, ప్రేమ్ రతన్ ధాన్ పాయో, బజ్రంగీ బైజాన్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న నటులకు బీమా చేసేందుకు కంపెనీలు ముందుకు రావని ఐసీఐసీఐ లాంబార్డ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు.