: మూడేళ్లలో ఆన్ లైన్ కొనుగోళ్ల రారాజులం మనమే!
రానున్న మూడేళ్లలో ఆన్ లైన్ కొనుగోళ్ల రారాజులం మనమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. సాంకేతిక విప్లవం కారణంగా ఇంటర్నెట్ వినియోగానికి యువత బాగా అలవాటుపడిపోయింది. సినిమా టికెట్ల దగ్గర్నుంచి, నిత్యావసర సరకుల వరకు అంతా ఆన్ లైన్ మాధ్యమంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2018 నాటికి ఆన్ లైన్ కొనుగోలుదారులు 55 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ఈ లెక్కన 2018 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా మారే అవకాశం ఉంది. దీనికి కారణం మొబైల్ నెట్ వర్క్ సేవలు విస్తరించడమేనని, పల్లెల్లో కూడా నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, ఆన్ లైన్ వ్యాపారం జోరుగా సాగనుందని సమాచారం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 6 కోట్ల మంది నెట్ వినియోగదారులుండగా, వీరి సంఖ్య 2018 నాటికి 28 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.