: సల్మాన్ ముఖంలో నవ్వు కనిపించేనా?
సల్మాన్ ముఖంలో నవ్వు కనిపిస్తుందా? ఈ రాత్రికి ప్రశాంతంగా పట్టుపరుపుపై నిద్రిస్తాడా? లేక నాలుగ్గోడల మధ్య నిద్రలేని రాత్రి గడుపుతాడా? ఈ సస్పెన్స్ మరికాసేపట్లో వీడనుంది. సల్మాన్ ఖాన్ కేసులో బాంబే హైకోర్టులో ఆయన తరపున న్యాయవాది అమిత్ దేశాయ్ తన వాదనలు పూర్తి చేశాడు. న్యాయమూర్తి థిప్సే ముందు వాదన వినిపిస్తూ, సల్మాన్ ఖాన్ డ్రైవింగ్ చేశాడని పోలీసులు నిరూపించలేదని, కారులో ఉన్న నాలుగో వ్యక్తి స్టేట్ మెంట్ నమోదు చేయలేదని, ఎన్నో లోపాలతో విచారణ ముగించారని వాదించారు. ఈ కేసులో 304 (2) వర్తించదని చెప్పారు. ఐదేళ్ల శిక్షను సస్పెండ్ చేయాలని అభ్యర్థించారు. అమిత్ తన వాదనను ముగించడంతో ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది తన వాదన ప్రారంభించారు. ఏదిఏమైనా అదృష్టం ఆయన వెన్నంటి ఉంటేనే ఈ కేసులో బెయిలు లభిస్తుంది. న్యాయమూర్తి కేసు విచారణ ముగిసే వరకూ తాత్కాలిక బెయిలును పొడిగించే అవకాశాలే ఉన్నట్టు న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ బెయిలును రద్దు చేసిన పక్షంలో ఆయన అరెస్టుకు కోర్టు వారెంట్ దాఖలు చేస్తుంది.